గిరిజనులకే భూములు దక్కాలి..పెట్టుబడిదారులకు కట్టబెడ్తేఊరుకోం: రఘునందన్ రావు

 

  • వెలిమెల, కొండకల్ తండావాసులతో ధర్నా
  • ఎంపీని అరెస్ట్ చేసిన పోలీసులు

రామచంద్రాపురం, వెలుగు: సాగు చేసుకుంటున్న గిరిజనులకే భూములు దక్కాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అమాయక గిరిజనులకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. సాగు చేసుకుంటున్న బిలా దాఖలు భూములను అక్రమ పద్ధతిలో ఇన్వెస్టర్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. వెంటనే ఈ ప్రొసీడింగ్స్ ఆపాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని వివాదాస్పద భూముల వద్ద వెలిమెల, కొండకల్ తండా వాసులతో కలిసి ఆయన శుక్రవారం ధర్నా నిర్వహించారు.

సంగారెడ్డి కలెక్టర్, ఎస్పీ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. సాయంత్రం వరకు ఆందోళన చేపట్టారు. దీంతో బీడీఎల్ భానూర్ పోలీసులు రఘునందన్ రావును అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘గిరిజనులకు న్యాయం జరిగేదాకా పోరాడుతాం. పోలీసులు, బౌన్సర్లను పెట్టి గోడలను అధికారులే తొలగించాలి. లేదంటే గ్రామస్తులతో కలిసి గోడలు కూల్చేస్తాం. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి. భూముల వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలున్నా పట్టించుకోవడం లేదు’’అని రఘునందన్ రావు మండిపడ్డారు.